ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రేషన్ ధరలు పెరగనున్నాయా..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో ఇచ్చే నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జగన్ సర్కార్ ఇప్పటికే చక్కెర రేటును పెంచగా త్వరలో కందిపప్పు రేటును కూడా పెంచబోతుందని సమాచారం. కందిపప్పు ప్రస్తుతం ఇస్తున్న రేటుతో పోలిస్తే 27 శాతం ధర పెరగనుందని తెలుస్తోంది.

జగన్ సర్కార్ రాష్ట్రంలో రేషన్ సరుకులకు మార్కెట్ ధరతో పోల్చి చూస్తే 25 శాతం మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం రేషన్ డీలర్ల నుంచి ఇప్పటికే పెంచిన ధరల ప్రకారం డీడీలను స్వీకరిస్తోందని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం అరకిలో పంచదార రూ.10కు ఇవ్వగా ప్రస్తుతం రూ.17కు ఇస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కందిపప్పును ప్రభుత్వం కిలో రూ.40కు ఇస్తుండగా జగన్ సర్కార్ కందిపప్పు ధరకు రూ.67కు పెంచాలని భావిస్తోంది.

జగన్ సర్కార్ ప్రతి 90 రోజులకు ఒకసారి బహిరంగ మార్కెట్ లోని ధరలను పరిశీలించి ధరలలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కందిపప్పు ధరల పెంపు గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్ బియాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. మార్చి నెల నుంచి లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేపడుతోంది.

ఈ నెల తరువాత ప్రభుత్వం ఉచిత రేషన్ ను పంపిణీ చేయదు. అయితే రేషన్ దుకాణాల్లో ఇచ్చే నిత్యావసర ధరలను పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెంపు విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.