‘బిగ్ బాస్’ షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ లాస్ట్ వర్డ్స్ చెప్పాడు. ‘బిగ్ బాస్’ ట్రోఫీని, రూ.50 లక్షల ఫ్రైజ్ మనీని అందుకున్న అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను. నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు. ఇక..
బిగ్‌బాస్ షో మొదలైన రోజు నుంచే బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. పార్టిసిపెంట్స్ అంతా ఒకచోట చేరి చేసే అల్లరి వేషాలు, సందడి, హ్యాపీ మూమెంట్స్, బాధాకర గుర్తులు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోయేలా ఉన్నాయి. ఎన్టీఆర్ హోస్టింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 70 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ షో ఫైనల్ ఆదివారం జరిగింది. ఈ షో ఫైనల్ విన్నర్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూసిన ఎదురు చూపులకు తెర పడింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరిగా పార్టిసిపెంట్స్ అంతా ఎలిమినేట్ అవుతూ చివరకు శివబాలాజీ, ఆదర్శ్ మిగిలారు. వాళ్లిద్దర్నీ ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ పైకి తీసుకొచ్చి బిగ్‌బాస్ సీజన్1 ఫైనల్ విన్నర్ ని ప్రకటించారు. ఆయనే శివబాలాజీ. 3 కోట్ల 34 లక్షల 3 వేల 154 ఓట్లతో విన్నర్‌గా నిలిచారు. అయితే బిగ్ బాస్ మొదటి నుంచీ బల్ల గుద్ది మరీ చెబుతున్నట్లు ఈ విన్నర్ ని నిజంగా ప్రేక్షకుల ఓట్లే నిర్ణయించాయా? మరి అయితే మధ్యలో ఈ పిచ్చి పనులు ఎందుకు? నాలుగున్నర గంటల పాటు సాగిన గ్రాండ్ ఫినాలేలో ఓవరాల్ విన్నర్ ని ప్రకటించడానికి ముందు జరిగిన మిస్టేక్స్ ని ఓసారి చూద్దాం..
చాలా మంది బిగ్ బాస్ విన్నర్ హరితేజ అవుతుందని భావించారు. అయితే చాలా మంది ఊహలు తారుమారు అయ్యాయి. ఆమె మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదుగురు ఫైనలిస్టుల్లో మొదట అర్చన ఎలిమినేట్ అవ్వగా….. అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయ్యారు. నవదీప్ ఎలిమినేట్ అయ్యే క్రమంలో నలుగురు సభ్యులతో ఎన్టీఆర్ బాక్సుల గేమ్ ఆడించారు. గేమ్ ఉత్కంఠగా సాగిన అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఐదుగురు హౌస్ మేట్స్ నుండి…ఒకరిని విజేతగా ప్రకటించే క్రమంలో అందరి కంటే ముందుగా అర్చన ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకులు ఊహించినట్లే అందరికంటే ముందుగా అర్చన ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే మొదటి నుంచీ బిగ్ బాస్ చెబుతున్నదేమిటంటే ప్రేక్షకుల ఓట్లే అంతిమ విజేతను నిర్ణయిస్తాయన్నారు. మరి నలుగురి పోటీదారుల్లో నవదీప్ ను ఎలిమినేట్ చేయించడానికి బాక్సుల గేమ్ ఆడించడం ఏమిటి? అక్కడ తక్కువ ఓట్లు వచ్చిన (తక్కువ వచ్చాయని చెబుతున్నారు ఇందులో నిజం ఎంతో?) నవదీప్ నిష్ర్కమించాడు కాబట్టి సరిపోయింది. అదే నవదీప్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయనుకుందాం? అప్పుడు బిగ్ బాస్ పక్కా లాటరీ లాంటి ట్విస్టు పెట్టడం మిస్టేక్ కాదా? అలాగే చివరకు..
ఐదుగురు ఫైనల్ కన్టెస్టెంట్స్‌లో అర్చన, నవదీప్‌లు నిష్క్రమించగా.. హౌస్‌లో హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్‌లు మాత్రమే మిగిలారు. ఇక వీళ్లలో మూడో స్థానం సరిపెట్టుకుని బిగ్‌బాస్ హౌస్‌ను ఇప్పుడే వీడాలనుకుంటే 10 లక్షల తీసుకుని వెళ్లొచ్చని ఎన్టీఆర్ ఆఫర్ ఇవ్వగా కన్టెస్టెంట్స్ ముగ్గురూ ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాని అక్కడ శివబాలాజీ ఆ పది లక్షలను తీసుకుని వెళ్లిపోయాడే అనుకుందాం.. మరి అది ప్రేక్షకుల ఓట్లను తక్కువచేసినట్లే కదా..
సుమారు 12 లక్షల మంది వేసిన ఓట్లను ఇలా బిగ్ బాస్ అనేక ట్విస్టులతో అగౌరవపర్చడంపై ఓటు చేసిన వారిలో చాలా మంది బాధ కలిగించింది. ఏది ఏమయినా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 షో 71 రోజుల ఎపిసోడ్ కు శుభం కార్డు వేసింది స్టార్ మా యాజమాన్యం.