శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా ఎస్సై.. అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.. కారణం అదేనా..?

0
313

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కలల కంటే సరిపోదు.. వాటిని సాకారం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇలా ఓ యువతి తనలక్ష్యం సాధించింది. పోలీసు కొలువు కొట్టాలనే కోరిక నెరవేర్చుకుంది. తల్లిదండ్రుల ఆశలను కూడా నెరవేర్చింది. కానీ ఈ ఘటన జరుగుతుందని వాళ్లు ఊహించుకోలేక పోయారు. ఆమె ఓ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన భవాణి.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మహిళా ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. పీటీసీలో ట్రైనింగ్ నిమిత్తం ఆమె వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆమె.. ఆ రోజు ఇంటికి వస్తున్నా అంటూ తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది.

కానీ అర్థరాత్రి ఆమె తన తరగతి గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఇటు విజయనగరం జిల్లా వాసులకు, కృష్ణాజిల్లా వాసులకు ఈమె మృతి ఎంతో షాక్ కు గురిచేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనా స్థలానికి వెళ్లిన వన్ టౌన్ పోలీసులు పరిసరాలను పరిశీలించారు.

ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమయి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనేది పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు దీనికి కారణం ప్రేమ కూడా ఉండొచ్చనేది పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.