జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి నిబంధనలివే.. వాళ్లు అనర్హులు..?

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. జూన్‌1, 1994కు ముందు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్లు, ఆ తరువాత మే 31, 1995 వరకు ఇద్దరు సంతానం ఉన్నవాళ్లు పోటీకి అర్హులు. జూన్‌ 1, 1994కు ముందు ముగ్గురు, మే 31, 1995 మరొకరు, ఆ తరువాత మరొక సంతానం ఉన్నవాళ్లు పోటీకి అనర్హులు.

మే 31,1995 నాటికి ఒక్కరు ఉండి ఒకే కాన్పులో కవలలు జన్మిస్తే పోటీకి అర్హులు. అలా కవలలు కాకుండా వేర్వేరు కాన్పుల్లో ఇద్దరు జన్మిస్తే మాత్రం అనర్హులు. మే 31, 1995 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు జన్మించినా ఎన్నికలలో పోటీ చేయవచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకుని మొదటి భార్య చనిపోయి ఆమెకు ఇద్దరు సంతానం, రెండో భార్యకు ఒక సంతానం ఉంటే పోటీ చేయడానికి వీలు లేదు.

అయితే అతని రెండో భార్య మాత్రం ఒక సంతానం మాత్రమే ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ముగ్గురు పిల్లలు జన్మించి నామినేషన్ల పరిశీలన సమయానికి ఒకరు చనిపోయినా ఎన్నికల్లో పోటీకి అర్హులు. నామినేషన్ల పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు ఉండి గర్భవతి అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. రేషన్ షాపు డీలర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు ఎన్నికల్లో పోటీకి అనర్హులు.

మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్లు సైతం ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం పోటీకి అనర్హులు. ఉద్యోగాలకు రాజీనామా చేస్తే మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది.