మన దేశంలోని ప్రతి మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థలను ఆదేశించిన విషయం మనందరికి తెలిసిందే. ఇందులో భాగం గానే ప్రతి టెలికం సంస్థ తమ కస్టమర్లను ఆధార్ లింక్ చేసుకోవాలంటూ సంక్షిప్త సందేశాలు పంపిస్తోంది..
దీనికి టెలికాం సంస్థల వారు నిర్వహించే స్టోర్లు, మరియు వారి రిటైల్ ఔట్‌లెట్లలో మొబైల్ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. మొబైల్ వినియోగదారు వారి సంబంధిత టెలికాం సంస్థకు చెందిన స్టోర్‌కు గాని లేక రిటైల్ ఔట్‌లెట్లకు వెళ్లి తమ మొబైల్ నెంబర్‌ను తెలియజేయగానే ఆ నెంబర్‌కు ఒక ఒటిపి వస్తుంది. ఓటీపీతోపాటు ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ మిషన్‌పై వేలిముద్రను వేయడం ద్వారా తమ పాత మొబైల్ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ ముగుస్తుంది. ఆధార్ ఆధారిత ఇ-కెవైసితో ఇప్పుడు టెలికాం కంపెనీలు కొత్త సిమ్‌కార్డులను జారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా పాత పద్దతి. తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ 2017 డిసెంబర్ 1 నుండి బయోమెట్రిక్ అనేది అవసరం లేకుండా, మనం సంబంధిత అవుట్ లెట్‌కు వెళ్లకుండా మన ఇంటి నుంచే చాలా సులువుగా సిమ్ కార్డు వెరిఫికేషన్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. సిమ్ రీవెరిఫికేషన్ కోసం ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు టెలికం డిపార్ట్మెంట్ వారు మూడు నూతన పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇవి త్వరలో మనకు అందుబాటులోకి రానున్నాయి.
ఆ మూడు పద్దతులు ఏవి అంటే:
* ఆధార్ ఓటీపీ బేస్డ్
* యాప్ బేస్డ్
* ఐవిఆర్‌ఎస్ సదుపాయం.
ఓటీపీని ఉపయోగించి మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయడం ఎలాగంటే..
1 మీ మొబైల్ నెంబర్ నుండి సంబంధిచిన టెలికం ఆపరేటర్‌కు మీరు జత చేసే ఆధార్ నెంబర్‌ను మెసేజ్ పంపించాలి.
2 మీ మెసేజ్ అందుకున్న సంబంధిత టెలికం ఆపరేటర్లు మీ ఆధార్ నెంబర్‌ను ధ్రువీకరిస్తారు.
3 మీ ఆధార్ ధ్రువీకరణ పూర్తి అయిన తరువాత, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ట్రాయ్) కు ఓటీపీ రిక్వెస్ట్‌ను పంపిస్తారు.
4 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నుంచి సంబంధిత వినియోగదారునికి సంబందించి మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
దీంతో ఆధార్ వెరిఫికేషన్ ఇ-కెవైసి పూర్తి అవుతుంది. అంతే కాకుండా ఇకపై కొత్తగా సిమ్ తీసుకునేవారు తప్పనిసరిగా ఇ-కెవైసి నమోదు చేయాలి. అయితే తాజాగా సుప్రీం కోర్టు మాత్రం గతంలో ఆధార్ తప్పనిసరి కాదు అని తీర్పు ఇచ్చిన విషయం మీకు తెలిసిందే. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందేనంటూ గడువును కూడా ప్రకటించింది.