బాల్య వివాహాలు అనేవి మన వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్నవే. ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు బాల్య వివాహాలు జరిపిస్తూనే ఉన్నారు. దీంతో చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న బాలికలకు ఇక జీవితమంతా నరక ప్రాయం అవుతోంది. ఒక వేళ భర్త మరణిస్తే ఇక ఆ బాలిక అలాగే జీవితాంతం ఉండాల్సిందే. సరిగ్గా ఇవే కష్టాలను అనుభవించాల్సి వస్తుందని అనుకుందో ఏమో గానీ ఆ యువతి మాత్రం తన బాల్య వివాహాన్ని చాలా తెలివిగా కోర్టులో రద్దు చేయించుకుంది. దీంతో ఇప్పుడామె ఉన్నత చదువులు చదివి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే పనిలో పడింది.
ఆమె పేరు సుశీల. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ లో ఉంటోంది. ఈమెకు తన 12వ ఏటే స్థానికంగా ఉన్న నరేష్ అనే వ్యక్తితో 2010వ సంవత్సరంలో పెళ్లి చేశారు. అయితే పెళ్లయినప్పటి నుంచి సుశీల తల్లి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో సుశీలకు 18 ఏళ్ల వయస్సు నిండగానే అత్త వారింటి దగ్గర దిగబెట్టడానికి పుట్టింటి వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అలా వెళ్లడం సుశీలకు ఇష్టం లేదు. దీంతో తన మనస్సులో ఉన్న మాటను ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. తాను చదువుకుంటానని, చదువంటే ఇష్టమని, అత్తింటికి పంపవద్దని వేడుకుంది. అయినా వారు వినలేదు. సుశీలను అత్తింట్లో దిగబెట్టేందుకే సిద్ధమయ్యారు.
దీంతో సుశీల 2016, ఏప్రిల్ 27న ఇంట్లో నుంచి అర్థరాత్రి బయటకు వచ్చేసింది. జోధ్‌పూర్‌లో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు కృతి భారతి సహాయంతో రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేరింది. అక్కడ ఉండే కోర్టులో కేసు వేసింది. తన 12వ ఏట తనకు పెళ్లి జరిగిందని, తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని, ఇప్పుడు మేజర్ అయ్యాను కనుక ఆ పెళ్లిని రద్దును చేయాలని కోర్టులో కోరింది. అయితే కోర్టు వారికి పెళ్లి అయినట్టుగా సాక్ష్యాలు చూపమంది. అయితే అవి సుశీల వద్ద లేవు. దీంతో ఆమె సుమారు 15 నెలల పాటు కోర్టులో పోరాడింది. ఈ క్రమంలో నే భర్తకు చెందిన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేసిన తన పెళ్లి ఫొటోలు ఆమెకు కనిపించాయి. వాటి సహాయంతో కోర్టులో మరోసారి వాదించింది. దీంతో కోర్టు సుశీల పెళ్లిని రద్దు చేసింది. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తోంది. ఉన్నత చదువులు చదువుతోంది. గొప్ప స్థానాలకు చేరుకోవాలని ఆమె కల, ఆశయం. బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఆమె కోరుకుంటోంది. ఆమె కల నెరవేరాలని మనమూ కోరుకుందాం. ఏది ఏమైనా ఈ విషయంలో సుశీలను అందరం అభినందించాల్సిందే..!