ఎక్కడైనా పార్కింగ్ ఫ్రీ… ఫ్రీ పార్కింగ్ పై కొన్ని కొత్త నిబందనలు మీ కోసం…!

0
1057

ఎక్కడైనా పార్కింగ్ ఫ్రీ… ఫ్రీ పార్కింగ్ పై కొన్ని కొత్త నిబందనలు మీ కోసం…!

పార్కింగ్ … మనిషి రోడ్ మీద పాడుకోవడానికైనా కాస్తో కూస్తో చోటు దొరుకుతుందేమో కానీ ఈ బైక్,కార్ పార్క్ చేసుకోవాలి అంటే మాత్రం అస్సలు ప్లేస్ దొరకదు.ఒకవేళ దొరికినా దాని రేట్ మాత్రం అబ్బో ఎందుకులే … పది రూపాయల పెన్ కొనుక్కోడానికి వెళ్లి పాతిక రూపాయల పార్కింగ్ ఛార్జ్ పే చేసిన రోజులు కూడా ఉన్నాయి.పార్కింగ్ కూడా ఒక పెద్ద మాఫియా రేంజ్ లో రన్ చేసే వాళ్ళు ఉన్నారు,ఒక ఫిక్సడ్ రేట్ అంటూ ఏం ఉండదు ఎవరికీ తోచినంత వాళ్ళు ఛార్జ్ చేయడం సరామాములు అయిపోయింది.

హైదరాబాద్ లో పార్కింగ్‌ ఫీజు దందా అడ్డగోలుగా సాగుతోంది. ఈ దోపిడీకి చెక్‌ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం (అక్టోబర్ -10) మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాల్స్‌, థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, కళ్యాణ మండపాలు, పరిశ్రమల భవనాల్లో ఉచిత పార్కింగ్‌ను తప్పనిసరి చేయనున్నారు.

ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు అయిన థియేటర్స్,మాల్స్,షాపింగ్ కంప్లెక్స్,ప్రైవేట్ హాస్పిటల్స్ వంటి ప్రదేశాల్లో అయితే పార్కింగ్ ఫీజు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే,కార్ పది నిమిషాలు పార్క్ చేస్తే 50 రూపాయలు వసూలు చేసే సంస్థలు చాలానే ఉన్నాయి.అలాగే రైల్వే స్టేషన్,బస్సు స్టాండ్ వంటి గవర్నమెంట్ ప్రదేశాల్లో కూడా ఒక్కో చోట ఒక్కో విధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు,ఈ పార్కింగ్ ఫీజు గురించి ప్రత్యేక చట్టాలు,నిబంధనలు వంటివి ఏమి లేకపోవడంతో ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది.సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లో పార్కింగ్‌ దోపిడీ అంశం ప్రస్తావనకు రాగా.. ఇకపై ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని నిర్ణయించినట్లు తెలిసింది. పార్కింగ్‌ పాలసీలో ఈ ఉచిత అంశం లేకపోయినా.. దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యేక జీవో జారీ కానున్నట్లు తెలసింది. వచ్చే ఏడాది లోగా ఈ ఫ్రీ పార్కింగ్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

నగరంలో పార్కింగ్‌ ఫీజులను అధికంగా వసూలు చేయడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.పది సరుకు కొన్నా రూ.20 నుంచి రూ.50 పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఈ దోపిడీపై కొందరు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నారు. ఆయా వాణిజ్య సంస్థల్లో కొనుగోళ్లకు వెళ్లిన వారికే ఈ ఉచిత సదుపాయం కల్పించేందుకు, ఇతరులు పార్కింగ్‌ ప్రదేశాల్లో గంటల తరబడి పార్కింగ్‌ చేయకుండా ఉండేందుకు ఆయా షాపులకు వెళ్లిన వారికి బిల్లులో పార్కింగ్‌ ఫీజు మేరకు మినహాయింపు ఇవ్వనున్నారు. నగరంలోని కొన్ని మాల్స్‌లో ఇప్పటికే ఈ పద్ధతి అమలులో ఉంది. సెల్లార్‌లో పార్కింగ్‌ చేయగానే ఫీజు వసూలు చేసి రసీదు ఇస్తారు. షాపింగ్‌ ముగిశాక బిల్లు చెల్లించేటప్పుడు రసీదు చూపిస్తే ఆ మేరకు బిల్లులో మినహాయింపు ఇస్తున్నారు. సినిమా థియేటర్లలో సినిమా టికెట్‌ను చూపిస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అమలు చేయనున్నారు.