ఎవరికి ఎవరు ఈ లోకంలో : రాత్రంతా వర్షంలోనే.. చిన్నారి మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని ఓనర్

0
1107

మానవత్వం మరోసారి మంటగలిసింది. ఆర్థిక సంబంధాలే తప్ప.. మానవ సంబంధాలకు తావే లేదని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్ కూకట్ పల్లి వెంకటేశ్వరకాలనీలో జరిగిన ఘటన అందరి హృదయాలను కలిచివేసింది. కాలనీలో నివాసం ఉంటున్న సురేష్ అనే ఆరో తరగతి చిన్నారి డెంగ్యూతో నిన్న రాత్రి చనిపోయాడు. అసలే కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓనర్ ఇంట్లోకి తీసుకురావొద్దంటూ అడ్డుకున్నాడు. దీంతో చేసేది లేక వర్షంలోనే బిడ్డ శవంతో గడిపారు కుటుంబ సభ్యులు. ఇంటి ముందు ఉన్న అరుగుపైనే చిన్నారిని ఉంచి.. తడవకుండా ఉండేందుకు ఈ కుటుంబ సభ్యులే దుప్పట్లతో అడ్డం ఉన్నారు. ఓ వైపు భారీ వర్షం – చనిపోయిన ఇంటి కుటుంబ సభ్యులను ఓనర్ తోపాటు.. చుట్టుపక్కల ఎవరూ కూడా ఆదుకోవటానికి ముందుకు రాకపోవటంతో రాత్రంతా నిస్సాహాయ స్థితిలో ఉన్నది ఆ కుటుంబం. ఉదయం విషయం తెలుసుకున్న కాలనీ వాసులు.. అప్పటికప్పుడు బాక్స్ తీసుకొచ్చి చిన్నారి మృతదేహాన్ని అందులో ఉంచారు. కాలనీవాసులు కొందరు ఆర్థికసాయం చేశారు. అంత్యక్రియలకు సహకారం అందించారు. ఇంటి ఓనర్ తీరుపై మండిపడుతున్నారు స్థానికలు.