కడుపు రగిలిన ఓ.. సామాన్యుడి లేఖ

0
1752

కడుపు రగిలిన ఓ.. సామాన్యుడి లేఖ

నా గాయలకు కారణం ఎవరు సార్ ? ట్రాఫిక్ పోలీసులకు ఓ సామాన్యుడి ప్రశ్న.

పాయింట్ల పేరిట మా లైసెన్స్ లు రద్దు చేసి, వాహనాలు సీజ్ చేసి, జైలు కి పంపే ట్రాఫిక్ పోలీసులకు ఓ వాహనదారుడి ప్రశ్న.

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నా వాహనాలు పట్టుకోవడం తప్పుపట్టంలేదు సార్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న నా టూ వీలర్ పై హెల్మెట్ పెట్టుకుని మాదాపూర్ నుంచి పెద్దమ్మ గుడివైపు వెళ్తున్న నాకు రోడ్డు ఎత్తుగా రావడంతో బండి స్పీడ్ పెంచా అంతే .. ఎగిరి దూరంగా పడ్డాను. బండి డామేజ్, నా చెయ్యి విరిగింది. కారణం రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో నా బండి పడటం.
హెల్మెట్ ఉన్నా నాకు తగిలిన దెబ్బలకు కారకులు ఎవరు సార్? ఇలాంటి అనుభవం నాకే కాదు సార్ సిటీలో చాలా మందికి తగిలే ఉంటాయి. ప్రముఖులు తిరిగే రోడ్డులే ఇలా ఉంటే, మిగతా రోడ్డులు ఎలా ఉంటాయో ఉహించుకోవచ్చు.

అసలు మహానగరం రోడ్డులు పరిస్థితి చూసారా? రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు, ఎగుడు దిగుడుగా రోడ్డు హద్దులు, ఎత్తుపల్లాలైనా రోడ్డులు, రోడ్డుల మధ్యలో మూతలు లేని మ్యాన్ హోల్స్, చినుకు పడితే రోడ్డు మధ్య నుంచునే వర్షపు నీరు, సూచికలు సిగ్నల్స్ లేని చౌరస్తాలు, రాత్రులు వెలగని స్ట్రీట్ లైట్లు , రోడ్డుపై దుమ్ము, ఆర్టీసీ బస్సులనుండి వచ్ఛే పోగలమధ్య వాహనదారుడి ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి.

ఇవి చాలవా వాహనదారుడు ఆసుపత్రికి వెళ్ళడానికి ? బండి షెడ్డు కి పంపడానికి, రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కాలో, చెయ్యి విరిగితే కారకులు ఎవరు ? వారి కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు ? అందుకే హైదరాబాద్ రోడ్డులకు వాటిని నిర్వహించే అధికారులకు పాయింట్స్ వేయండి. కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగ పరుస్తున్న డిపార్ట్మెంట్ కు షాక్ తగిలేలా… – మురళీధర్ బలివాడ