కొడుకు కోసం ఆ ప్రముఖ నటి రోడ్డు పక్కన దోసెలు వేసి అమ్ముకుంటుంది

0
1348

బట్టలు… నగలు… పర్‌ఫ్యూమ్స్… ఓ సినీతార, టీవీ సెలబ్రిటీ సొంత వ్యాపారం అనగానే గుర్తొచ్చేవి ఇవేనా..? కానీ ఒక్కసారి మనం నేషనల్ హైవే 66… కేరళ, తమిళనాడు మధ్యలో… నెయ్యతినకర దగ్గర… అక్కడ ఓ నటి… పేరు కవితా లక్ష్మి… మళయాళ సీరియల్ స్త్రీధనంలో ఫేమస్… ఆమె ఓ అసాధారణ వృత్తిలో కనిపిస్తుంటుంది… మూడు వారాలుగా ఇదే సీన్… సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా… హైవే పక్కన నిలబడి దోసెలు వేస్తూ కనిపిస్తుంది… ఆమ్లెట్లు, బీఫ్ కర్రీ కూడా…!

నిజమే… అబద్ధం కాదు… 43 సంవత్సరాల ఈ నటి ఏదో పాత్రలో నటించడం లేదు… ఆమె ఆ రోడ్డు పక్కన సెంటర్‌లో చెమటలు కక్కుతూ జీవిస్తుంటుంది… అయ్యో, అయ్యో, ఎందుకమ్మా ఇలా..? అనడిగాం అనుకొండి… ‘ఏం చేద్దాం సార్..? మా అబ్బాయి ఆకాష్ కృష్ణను బ్రిటన్‌లో ఓ కోర్సులో జాయిన్ చేశాను…

ఖర్చులకు నా సంపాదన సరిపోవడం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది… ‘‘బ్యాంకులేమో లోన్లు ఇవ్వవు… తాకట్టు పెట్టడానికో, గ్యారంటీ ఇవ్వడానికో నాకేమో భూముల్లేవ్, సరిపడా ఆస్తుల్లేవ్, ఓ చిట్టీ కడుతున్నా… వాడేమో ముందే ఇవ్వరా అంటే వీలుకాదుపో అంటున్నాడు…’’ అని వివరిస్తుంది ఆమె…

‘ప్చ్, ఒక ఇంటిపైనో, భూమిపైనో నేను పెట్టుబడి పెట్టకపోవడంపై ఇప్పుడు అసంతృప్తి ఫీలవుతున్నా… నా సంపాదనంతా పిల్లల చదువుకే ఖర్చు… సొంతిల్లు కన్నా అదే ముఖ్యం అనుకున్నాను…’ అంటున్నది ఆమె…… పదేళ్లుగా ఆమె అదే నెయ్యతినకర దగ్గర ఓ రెంటెండ్ ఇంట్లో ఉంటుంది..

ఆమెకు కొడుకే కాదు, ఉమా పార్వతి అనే ఓ కూతురు కూడా ఉంది… పదో తరగతి… కవిత 13 ఏండ్ల క్రితమే భర్త నుంచి విడిపోయింది… ఇలాంటి ఏ విషాదాల్లోనైనా భార్యల బాధితులుగా మిగులుతారు, బాధ్యతలు పైన పడతాయి అనేది తెలుసు కదా… ఆమె సంపాదన సరిపోవడం లేదు మరి… ఏం చేయాలి..? ‘‘అందుకే ఈ మార్గం ఎంచుకున్నా… నా వ‌ృత్తి, నా గౌరవం… తప్పేం ఉంది..? నా అవసరాలు ముఖ్యం కదా’’ అంటున్నదామె….

‘‘మేం ఇలా రోడ్డు పక్కన సెంటర్లలో బోలెడు సార్లు తినేవాళ్లం… ఫ్రెష్… గరం… కెమికల్స్ ఉండవ్, ప్రిజర్వేటివ్స్ ఉండవ్… పెట్టుబడి తక్కువ… నా పిల్లలకు ఏం చేసి పెట్టానో అవే ఇప్పుడు అందరికీ చేసి పెడుతున్నా… అంతే… నా బిడ్డ కూడా నాకు సాయం చేస్తుంది…’’ అంటున్న ఆమె నిజానికి టీవీలో పెద్ద స్టార్… స్త్రీధనంలో శాంత అనే నెగెటివ్ రోల్‌లో బాగా పాపులర్… సాల్ట్ అండ్ పెప్పర్; అయలుమ్ జానుమ్ తమ్మిల్, మమ్ముట్టి నటించిన తప్పన వంటి సినిమాల్లోనూ నటించింది…

ఇప్పుడు అయలాటే సుందరి అనే సీరియల్‌కు వర్క్ చేస్తున్నది… టీవీ నిర్మాతలకు ఆమె ముందే చెబుతున్నది… తన స్థితి ఏమిటో, తను సాయంత్రాలు ఎక్కడ ఏం పనిచేస్తున్నదో… అందుకే డే షూటింగులో మాత్రమే నటిస్తూ సాయంత్రాలు ఇలా అదనపు సంపాదన కోసం నానా ఇక్కట్లూ పడుతున్నది… త్వరగా సెట్ నుంచి వెళ్లడానికి, కాస్త ఆలస్యంగా ఉదయం హాజరు కావటానికి టీవీ సీరియల్ దర్శకులు కూడా వోకే అంటుంటారు…

‘‘ఏం చేస్తాం సార్..? మొదట్లో మా దోసె బండ కేవలం 20 దోసెలకే సరిపోయేలా ఉండేది… ఇప్పుడు దాన్ని 40 దోసెలు వేసేలా అప్‌గ్రేడ్ చేసుకున్నాం… మా అమ్మ చెప్పేది… మాడిన మొహంతో సర్వ్ చేయొద్దు, నవ్వు మొహంతో ఫుడ్ పెడితే కస్టమర్ సంతోషమే వేరు… అన్నం వడ్డిస్తుంటే అంత తెల్లగా నీ మొహంలో నవ్వు ఉండాలి అని….’’ అంటున్నది..

ఆమె… అన్నట్టు చెప్పలేదు కదూ… ఆమె తన కెరీర్‌ను ఇరవయ్యేళ్ల క్రితం స్టార్ట్ చేసింది… ‘‘నాకు లగ్జరీ లైఫ్ అవసరం లేదు… నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి… అప్పటివరకూ కష్టపడుతూనే ఉంటా’’ అంటున్నది ఈ తల్లి… సూపర్… కంగ్రాట్స్ తల్లీ…. మరో మాట… సరదాాగా మన తెలుగు టీవీల్లోని ప్రముఖ నటీమణుల్ని ఒక్కసారి ఊహించుకొండి… ఎంతమంది ఇలా రోడ్డు పక్కన దోసెలు వేస్తూ పిల్లల కోసం నాలుగు పైసలు సంపాదించుకోగలరు..? ఊరికే… సరదాగా…!!