డ్యాన్స్ బేబి డ్యాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఉదయభాను. బుల్లి తెరపై, వెండి తెరపై ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. దాదాపు 15 సంవత్సరాలు ఈమె బుల్లి తెరను ఏలింది అంటే అతిశయోక్తి కాదు. ఏ ప్రోగ్రాం చేసినా, ఏ స్టేజ్ షో చేసినా ఆ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చేది.
బుల్లితెర మహారాణి.. మాటల మాంత్రికురాలు.. ఇలా ఒకటేంటి ఉదయభాను గురించి ఎన్ని చెప్పినా తక్కువే..అంటారు అభిమానులు….ఆమె దాదాపు సంవత్సరంన్నర కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది.
బుల్లితెర శ్రీదేవిగా పేరు తెచ్చుకున్న ఆమె అంతకంటే అందమైన మనసు కూడా ఉందని ఎన్నో సందర్భాల్లో రుజువుచేసుకున్నారు. అతి చిన్న వయసులో కెరీర్ ప్రారంభించి ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని స్వశక్తితో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఏడాది కిందట కవల పిల్లలకు జన్మనిచ్చి మూడేండ్ల విరామం తర్వాత ‘నీతోనే డ్యాన్స్’ షోతో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమెతో మానవి చిట్‌చాట్…
సుమారు మూడేండ్ల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చారు.
ఈ సమాజంలో మహిళలుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. నరరూప రాక్షసుల మధ్య బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ చాలా అవసరం. స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. స్త్రీ తలచుకుంటే ఏమైనా చేయగలదు. ప్రతి ఆడపిల్ల ఓ శక్తిగా మారి ఈ దుష్ట సమాజంపై తిరుగుబాటు చేయాలి.
ధైర్యంగా సమస్యలను ఎదుర్కొవాలి. ఒక్కోసారి మనల్ని రక్షించాల్సిన చేతులే మన పీక పిసికే పరిస్థితి వస్తున్నది. అలాంటి వాటిని కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిలకు ఉండాలి. అని అంటుంది ఉదయభాను…
ఉదయభాను పుట్టింది కరీంనగర్ దగ్గర కొహెడ. అమ్మ అరుణ, ఆయుర్వేద డాక్టర్. నాన్న ఎస్.కె పటేల్. నాన్న కూడా డాక్టరే. అయితే నాలుగేండ్ల వయసులోనే నాన్న చనిపోయారు. ఆయన చాలా దాన ధర్మాలు చేసేవారు. వందల ఎకరాలు దానం చేసిన గొప్ప దాత. కష్టపడేతత్వం వారి నుంచే తనకు వచ్చిందని, వారిచ్చిన ధైర్యంతోనే చిన్నతనం నుంచే మోయలేనన్ని భారాలు తనమీద ఉన్నా ముందుకు నడవగలిగానని అంటుంది ఉదయభాను.
అమ్మ డ్యాన్స్ నేర్పించింది. స్టేజ్ షోలు చేసేదాన్ని. అక్కడ నన్ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. మొదట చేసింది ఎర్రసైన్యం సినిమాలో. అప్పుడు ఎత్తు పెరిగాను గానీ చాలా చిన్నదాన్ని. డైలాగులు చెప్పడానికి వణికిపోయేదాన్ని. చెమటతో బట్టలు తడిసిపోయేవి.
అలాంటిది ‘హృదయాంజలి’ షో వందల మందిలో మైక్ పట్టుకున్నాను. అప్పుడు ఆ ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలియదు. బహుశా జీన్స్ నుంచి వచ్చిన ధైర్యమేమో. ‘నిగ్గిదీసి అడుగు’ వంటి ఛాలెంజింగ్ షోస్ కూడా అదే ధైర్యంతో చేయగలిగాను. అంటూ చెప్పుకోచింది ఉదయభాను..
నా పిల్లల్ని ఆడపులుల్లా పెంచుతాను. ఈ సమాజంలో అమ్మాయిలు అలా ఉంటేనే బతకగలరు. మమ్మల్ని కాపాడండీ అంటూ ఆర్తనాదాలు చేయకూడదు. దాడి చేసే వారిపై తిరగబడాలి. అందుకే ఆడపిల్లలకు కేవలం డ్యాన్స్, సంగీతం నేర్పిస్తే సరిపోదు. సెల్ఫ్‌డిఫెన్స్ కూడా నేర్పించాలి.
ఎక్కడి నుంచి ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు. ఎలా వేధిస్తాడో తెలియదు. వారి బారి నుంచి తమను తాము కాపాడుకునే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆడపిల్లలకు ఇవ్వాలి. ఏడిస్తే ఇంకా ఇంకా ఏడిపిస్తారు. అందుకే ఏడ్చి కన్నీళ్ళను వృధా చేసుకోకూడదు అంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను..
ఇవన్నీ నా అనుభవాల నుంచి నేర్చుకున్నాను. మన వైపు వేలెత్తి చూపించే వాళ్ళ వేలుని విరగ్గొట్టాలి. ప్రేమ పంచడంతో పాటు తేడా వస్తే తాట తీయాలి. ఇవన్నీ నా పిల్లలకు నేర్పిస్తాను. దీని గురించే ఓ పుస్తకం కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఓ సాంగ్ కూడా రాశాను. అయితే నేను పెన్ను కదిలిస్తే విప్లవం వచ్చేస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. కానీ పుస్తకం వివరాలు కూడా త్వరలోనే మీడియాకు చెబుతాను.
బలం, ధైర్యం తన భర్తేనని, ముందు మేం ఆర్థికంగా స్థిరపడాలనుకున్నామని, అన్నేండ్ల తమ ప్రేమకు సాక్షాలే తమ కవల పిల్లలని, వాళ్ళను చూస్తే తన ఒత్తిడి మొత్తం ఇట్టే ఎగిరిపోతుందని అంటోంది ఉదయభాను. తమ పెండ్లి చాలా స్ట్రగుల్ పడి చేసుకున్నామని, జీవితం అనుక్షణం ఓ యుద్ధం. ఆ యుద్ధంలో జయిస్తేనే బతుకు. విజరు అనే సోల్జర్ నా పక్కన ఉన్నన్ని రోజులు విజయం నాదే అని అంటోంది ఉదయభాను…
సమస్యలు లేకుండా జీవితమే ఉండదు. ‘భయం తలుపు తట్టింది.. ధైర్యం తలుపు తీసింది ఎదురుగా ఎవరూ లేరు’. ఇది నాకు బాగా నచ్చిన వాక్యం. ఛాలెంజెస్ వచ్చినప్పుడే మనలో ఉన్న శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. నా దృష్టిలో స్త్రీ ఎప్పటికీ ఒంటరి కాదు. తనలోపల ఓ శక్తి స్వరూపిణి దాగి ఉందని ఎప్పుడూ మర్చిపోకూడదు. సమస్య వచ్చినప్పుడు ప్రతి స్త్రీకీ తనని తానే ఓ సైన్యంగా మార్చుకునే సత్తా ఉంటుంది. ఎలాంటి సవాల్ ఎదురైనా ధైర్యంగా నిలబడగలుగుతుంది. దీనికి నేనే ఓ మంచి ఉదాహరణ.
స్ట్రాంగ్‌గా ఉండాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. తొందర తొందరగా పైకి వచ్చేయాలనే ఆరాటం ఉండకూడదు. మన కష్టాన్నే నమ్ముకోవాలి. కష్టపడితే ఫలితం కచ్చితంగా ఉంటుంది. అన్నింటికంటే ముందు మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ చెక్కుచెదరనీయకూడదు. చిన్న వీక్ పాయింట్ దొరికినా మనతో ఆడుకోడానికి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అధైర్యానికి తావు ఇవ్వకూడదు. అంటూ ఒక సక్సెస్ ఫుల్ మహిళ గా తన మనోభావాన్ని ఆవిష్కరించింది…ఉదయభాను…