తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత కొన్నేళ్లలో ఎప్పుడూ కురవని విధంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యే సుభాష్‌ రెడ్డి వరద పరిస్థితులను సమీక్షించేందుకు బోటులో వెళ్లారు. ఉప్పల్ ప్రాంతంలోని మహిళలు సుభాష్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. మహిళలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఘాటుగా విమర్శలు చేశారు.

తాము వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నామని తమను కనీసం సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ఆలోచన కూడా గెలిపించిన నేతలకు లేదా..? అంటూ మహిళలు ప్రశ్నించారు. వరదల్లో చిక్కుకుని తాము చనిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకుని ఇలాగే చనిపోవాలా..? అని ప్రశ్నించారు. చావాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎమ్మెల్యేల పేరు రాసి చస్తామంటూ ఎమ్మెల్యేను మహిళలు బెదిరించారు.

తాము నివశించడానికి ఇబ్బందులు పడే ఇలాంటి ప్రాంతంలో ఇళ్లను ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. వేసుకోవడానికి సరైన దుస్తులు కూడా లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వర్షం అకస్మాత్తుగా వచ్చిందని అకస్మాత్తుగా వర్షం వస్తే తామైనా ఏం చేయగలమని ప్రశ్నించారు. మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వచ్చిన దారినే ఎమ్మెల్యే వెనక్కు వెళ్లిపోయారు.

మరోవైపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. అమీర్ పేట్ లోని జనప్రియ కాలనీలోకి వరద నీరు చేరుతోంది. రోడ్డు కోతకు గురి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల తెలంగాణలో 70 మందికి పైగా మృతి చెందారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here