ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెబుతూ ఉంటారు. గత సంవత్సరం రైతులకు కాసుల వర్షం కురిపించి.. సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు చుక్కలు చూపించిన ఉల్లి ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఉల్లి కిలో 10 రూపాయలకు అమ్మిన వ్యాపారులు ప్రస్తుతం మార్కెట్ లో 60 నుంచి 80 రూపాయలకు చేరుకోనున్నారు.

మరికొన్ని రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతేడాది కిలో ఉల్లి 160 రూపాయల వరకు పలికింది. ఈ సంవత్సరం వర్షాలు, వరదల వల్ల ఉల్లి కుళ్లిపోవడంతో ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం కిలో ఉల్లి 200 రూపాయలు పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. పండగల నేపథ్యంలో ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఉల్లి ధరలు భారీగా పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. దేశంలోని ప్రధాన మార్కెట్ లలో క్వింటాల్ ఉల్లి ధర 6,000 రూపాయల నుంచి 7,000 మధ్య పలుకుతోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉల్లి పంటను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో సైతం ఉల్లి పంట దెబ్బ తినడంతో ధర భారీగా పెరిగింది.

ఉల్లి ధర భారీగా పెరిగితే 2021 ఫిబ్రవరి వరకు ధరలు అదుపులోకి వచ్చే అవకాశాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు మూసివేయడంతో గతంలో ఉల్లి ధరలు తగ్గగా డిమాండ్ పెరగడం వల్ల ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here