2021లో ప్రపంచం అతలాకుతలం.. భవిష్యవాణి చెప్పిన బాబా వంగ..?

0
322

2020 సంవత్సరాన్ని దేశంలోని ప్రజలు బ్యాడ్ ఇయర్ గా భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రజలు ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు 2020లో ఏర్పడ్డాయి. అయితే దేశంలోని ప్రజలు 2021 సంవత్సరంలో పరిస్థితులు మారతాయని భావిస్తున్నారు. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కష్టాలు తీరతాయనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు.

అయితే బాబా వంగ మాత్రం 2021లో ప్రపంచం అతలాకుతలం అవుతుందంటూ భవిష్య వాణిని వెల్లడించారు. మన దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామిలా బల్గేరియాకు చెందిన బాబా వంగ కూడా కాలజ్ఞాని కావడం గమనార్హం. 12 సంవత్సరాల వయస్సులోనే టోర్నడో వల్ల చూపు కోల్పోయిన బాబా వంగ అసలు పేరు వెంజిలీయా పెండవా దిమిత్రోవా. అయితే చూపు కోల్పోయినప్పటి నుంచి ఈమె భవిష్యత్తును ఊహించి చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు.

ఆశ్చర్యం ఏమిటంటే బాబా వంగ చెప్పిన భవిష్యవాణి చాలావరకు నిజమైంది. అందువల్ల బల్గేరియా ప్రజలు సైతం ఆమె మాటలను విశ్వసిస్తారు. పుతిన్ ‌పై హత్యాయత్నం, చెర్నోబిల్‌ అణు ప్రమాదం , డయానా మరణం, యూనియన్ విచ్చిన్నం గురించి చెప్పిన బాబా వంగ 1996లో చనిపోయారు. అయితే బాబా వంగ చనిపోవడానికి ముందే 2021లో ప్రజలు ఇబ్బందులు పడతారని, ప్రకృతి విధ్వంసం జరుగుతుందని తెలిపారు.

2021లో ప్రపంచం వినాశకర ఘటనలతో అతలాకుతలం అవుతుందని.. క్యాన్సర్ వ్యాధికి మాత్రం ఔషధం అందుబాటులోకి వస్తుందని అన్నారు. రైళ్లు సౌరశక్తితో నడుస్తాయని.. పెట్రోల్ ఉత్పత్తి ఆగిపోతుందని.. ఓ డ్రాగన్ ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకుంటుందని అన్నారు. 2341 సంవత్సరం నాటికి భూమి మనుషులు జీవించడానికి పనికిరాదని ఆమె భవిష్యవాణిని వెల్లడించారు. ఆమ భవిష్యవాణి నిజమైతే 2021లో కూడా ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు.