YSRCP Vs TDP : ఏపీ రాజకీయాల్లో కక్షలు, కార్పణ్యాలు కాసింత ఎక్కువే. గతంలో టీడీపీ చేసిందానికి కౌంటర్‌గా ప్రస్తుతం వైసీపీ రివెంజ్ తీర్చుకునే పనిలో ఉంది. మరోసారి క్విడ్ ప్రోకో అంశం ఏపీలో కలకలం రేపుతోంది. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఓ ఘటన పెద్ద సంచలనంగా మారింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు, ప్రస్తుత సీఎం జగన్ అంతకు ముందు తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ కేంద్ర దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపారు. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాయి. అయితే ఈ అంశాలేమీ గత ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి నష్టమూ చేకూర్చలేదు. మరి ఇప్పుడు వైసీపీ మరోసారి క్విడ్ ప్రోకో ఆరోపణలు చేస్తూ టీడీపీపై సీఐడీని ప్రయోగించింది. మరి ఇప్పుడు టీడీపీపై సీఐడీ దర్యాప్తు ప్రభావం చూపిస్తుందా? ఏం జరగనుంది? వంటి అంశాలపై ప్రత్యేక కథనం.

ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ..!
సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ స్టేను ఎత్తివేయించింది. మరోవైపు సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయడంతో ఆఘమేఘాల మీద ఆస్తులు జప్తు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు ఆరోపణలు వచ్చినట్టే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై సైతం అవే ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను టీడీపీ ప్రస్తావిస్తోంది. పైగా జగన్.. ఢిల్లీకి ప్రతిసారి వెళ్లడం కేసుల బారి నుంచి బయట పడేందుకేనని అంటున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలో చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు లింగమనేని రమేష్‌కు చెందినది కావడం గమనార్హం. దీని జప్తునకు కారణం ఏంటంటే.. రాజధాని ప్రణాళిక డిజైన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ వంటివి లింగమనేని ఇంటికి అనుకూలంగా మార్పులు చేశారనేది ప్రధాన అభియోగం.

ఎవరేం అంటున్నారు..!
లింగమనేని ఇంటికి అనుకూలంగా అన్ని మార్పులు చేర్పులు చేయడంతో ఆ ఇంటిని చంద్రబాబుకు ఉచితంగా నివాసముండేందుకు ఇచ్చేశారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ సహా 14 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఇందులో కక్ష సాధింపు అంటూ ఏమీ లేదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని చెప్పుకొస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు సైతం పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. కావాలనే టీడీపీ నేతలపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.