Cyber Crime: దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుదలతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మీ వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, మీకు ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేర్వేరు మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ యాజమాన్యానికి భారీ టోకరా వేశారు. ఒక్క మెయిల్‌తో ఏకంగా రూ. 46 లక్షలు కాజేశారు. అది నిజమైన మెయిల్ కాదని, సైబర్ నేరగాళ్ల మాయ అని గుర్తించిన కంపెనీ యాజమాన్యం… సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలు ప్రకారం… నగరంలోని సంతోష్ నగర్‌లో గల ‘సెన్స్‌కోర్ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్’ మెడికల్ ఏజెన్సీ, కాలిఫోర్నియోలోని ‘ఏజీ సైంటిఫిక్’ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా ఏడాదిలో మూడు సార్లు ‘ఏజీ సైంటిఫిక్’ నుంచి మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను సెన్స్‌కోర్ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏజెన్సీ కొనుగోలు చేస్తుంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అవసరం ఏర్పడటంతో.. ‘ఏజీ సైంటిఫిక్’వారిని సంప్రదించారు ఇక్కడి ఏజెన్సీ వారు. అయితే, ఏజీ సైంటిఫిక్ వాళ్లు తమ బ్యాంక్ ఖాతాను ప్రతి మూడు నెలలకు మారుస్తుంటారట. దీనిని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు… పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ‘ఏజీ సైంటిఫిక్’ కంపెనీలో ‘ఐ’ అనే లెటర్ తీసేసి ఫేక్ మెయిల్ సృష్టించారు.
మెయిల్ హ్యాక్ చేసి ఎన్ని లక్షలు కాజేశారంటే ?
ఆ ఫేక్ మెయిల్‌తో రూ.46 లక్షలకు కొటేషన్‌ను పంపి బ్యాంక్ అకౌంట్‌ను కూడా పంపారు. అయితే, ఏజీ సైంటిఫిక్ వారు బ్యాంక్ అకౌంట్లను మారుస్తుంటారని, ఈ సారి కూడా అలాగే మార్చి ఉంటారని భావించి వాళ్లు అడిగిన రూ.46 లక్షలను కేటుగాళ్ల పంపిన అకౌంట్లకు పంపారు. అయితే, ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకోగా… తాజాగా మీ డబ్బులు రాలేదంటూ ఏజీ సైంటిఫిక్ వాళ్లు మెయిల్ పెట్టడంతో విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.