Viral News : గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి రికార్డ్ సృష్టించిన వ్యక్తిని తలదన్ని కొత్త రికార్డు సృష్టించడం ఇంకా కష్టం. కానీ మణిపూర్‌కి చెందిన బాడీ బిల్డర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ని అతి సునాయాసంగా బద్దలు కొట్టాడు. 24 సంవత్సరాల తౌనోజామ్ నిరంజోయ్ సింగ్ అనే యువకుడు కేవలం నిమిషంలో చేతి వేళ్లను నేలపై మోపి అత్యధిక పుష్ అప్‌లు తీసి ఔరా అనిపించాడు.

గతంలో 2009 మే 25న యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన గ్రాహం మాలీ నిమిషంలో 105 పుష్ అప్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకోల్పితే…అతడి రికార్డును బద్దలు కొట్టాడు నిరంజోయ్ సింగ్. జనవరి 14న ఇంపాల్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు నిరంజోయ్‌సింగ్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు, స్థానికుల సమక్షంలో కేవలం 60 సెకన్లలో 109 పుష్ అప్స్ చేసి తన పేరును గిన్నీస్ బుక్‌లో ఎక్కేలా చేశాడు నిరంజోయ్ సింగ్.

నిరంజోయ్ సింగ్‌కు పుష్ అప్స్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాదు గతంలో కూడా ఎన్నో క్రీడలు, ఆటలతో పాటు బాడి బిల్డింగ్‌లో పతకాలు సాధించాడు. మణిపాల్ లోని ఇంపాల్ ప్రాంతంలో ఇలాంటి యువకులు చాలా మంది యువకులు నిరంజోయ్‌సింగ్‌ని ఆదర్శంగా తీసుకొని క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.
మణిపూర్ ఆణిముత్యం అంటూ ప్రశంసిస్తున్న ప్రముఖులు…
మణిపూర్‌కి చెందిన ఈ యువకుడు సాధించిన ఈ ఘనతను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఊహించని విజయాన్ని దక్కించుకున్నావు అంటూ ట్వీట్ చేశారు కిరణ్ రిజిజు. అలానే 24 సంవత్సరాల యువకుడు నిమిషంలో 109 పుష్ అప్స్ చేయడం గొప్ప విషయమని మణిపూర్ మంత్రులు, జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. నిరంజోయ్‌సింగ్‌ని సన్మానించారు. నిమిషంలో 120 పుష్ అప్స్ చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు నిరంజోయ్‌సింగ్. అతని ప్రయత్నం సఫలం కావాలని… మరో రికార్డు నెలకోల్పాలని అందరం కోరుకుందాం.