ఆ పాడే సీన్ వద్దన్న వారానికే… కొడుకుకి పాడే కట్టాల్సి వచ్చింది : కోట శ్రీనివాసరావు

0
7083

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు ప్రస్థానం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరియర్ మొదట్లో ఈయన చేసిన సినిమాలు కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈయన విలన్ పాత్రలో నటించకుండా జీవించారని చెప్పవచ్చు. ముఖ్యంగా “ఆమె” చిత్రంలో నటించినప్పుడు కొంతమంది ఆడవాళ్లు ఇతనిని చూసి భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు ఆ తర్వాత కమెడియన్ గా,వయసు పైబడిన తర్వాత తాత పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం వయసు పైబడటం సినిమా ఇండస్ట్రీకి దూరమైన కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని తన గురించి తన కొడుకు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కోట శ్రీనివాసరావుకు వ్యక్తిగతంగా జగపతిబాబుతో మంచి అనుబంధం ఉండేది. ఈ అనుబంధంతోటే ఓ సందర్భంలో మీ అబ్బాయిని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావచ్చు కదా అని జగపతిబాబు అన్నప్పుడు.. కోట శ్రీనివాసరావు నా కొడుకు ఒక పెద్ద హీరో కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాలాగా విలన్ అయితే చాలు జీవితకాలం సినిమా అవకాశాలు వస్తాయని జగపతిబాబుతో అన్నారు. ఆ సమయంలోనే జగపతి బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం “గాయం 2”. ఈ సినిమాలో విలన్ పాత్రలో కోట శ్రీనివాస్ రావు కొడుకు నటించారు.

ఈ సినిమాలో ఓ సన్నివేశంలో భాగంగా.. జగపతిబాబు కోట కొడుకును చంపి పాడే పై తీసుకువచ్చి తన ఇంటి ముందు పడేసే సన్నివేశాన్ని తెరకెక్కించాలి. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం పాడే కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ సన్నివేశాల్ని దగ్గరుండి చూసిన కోట శ్రీనివాసరావుకి మనసులో ఏదో అలజడి కలిగింది. ఎంతైనా కన్నకొడుకును అలా పాడెపై చూసే సన్నివేశాన్ని చూడటానికి ఆయన మనసు ఒప్పలేదు.

ఈ నేపథ్యంలోనే జగపతి బాబు దగ్గరికి వెళ్లి మీతో ఒక విషయం చెప్పాలి అంటూ నా కొడుకుని అలా పాడెపై చూడటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో జగపతిబాబు మీ బాధ నాకు అర్థమైంది. పాడే పై మీ కొడుకుని కాకుండా అతని స్థానంలో డూప్ ను పెడదామని చెప్పారు. ఈ సన్నివేశం జరిగిన వారం రోజులకు సరిగ్గా తన కొడుకు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయి నిజంగానే పాడే పై చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.