తంతే బూరెల బుట్టలో పడటమంటే ఇదేనేమో.. ఏపీలో ఏకకాలంలో ఒక పార్టీ పాతాళానికి.. మరో పార్టీ ఆకాశానికి ఎదగడం చూస్తున్నాం. వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. కూటమి వర్సెస్ వైసీపీ హోరాహోరీ ఉంటుందనుకున్నారంతా కానీ ఫలితాలు చూస్తే వార్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కేంద్రంలోనూ టీడీపీ, జనసేనలు కీలకంగా మారాయి. ఏపీ కేంద్రాన్ని అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లిపోయింది. ఒక కేంద్ర పదవికే అంతకు ముందు దిక్కుండేది కాదు.. ఇప్పుడు ఏపీకి ఏకంగా ఐదు కేంద్ర పదవులు దక్కబోతున్నాయని టాక్. వీటిలో టీడీపీ నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరు.. జనసేన నుంచి ఒకరికి కేంద్ర పదవులు దక్కబోతున్నాయని సమాచారం. మొత్తానికి కేంద్రంలో ఏపీ చక్రం తిప్పబోతోంది. ఇది ఆనందించదగిన తరుణమే.

మిత్ర పక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి?
ఏపీలో గత ఐదేళ్లుగా అభివృద్ధి శూన్యం. ఏపీని గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రోడ్ల నుంచి మొదలు పెడితే రాజధాని పునర్నిర్మాణం వంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారడం కూడా ఏపీకి ప్లస్ కానుంది. కొంత మేర ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్టే. ఇక టీడీపీ నుంచి కేంద్ర పదవులు దక్కించుకునే వారిలో కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని టాక్. జనసేన నుంచి బాలశౌరికి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ నుంచి పురందేశ్వరికి అవకాశం లభించవచ్చని సమాచారం. ఈ మేరకు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోదీ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి వరకూ ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి? వారికి ఏ ఏ శాఖలివ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి సైతం వచ్చేశారట.
కీలక శాఖలు బీజేపీకే..
ఇవాళ సాయంత్రం మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తనతో ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఇవాళ ఉదయమే మోదీ రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తారట. ఆ వెంటనే ఆయా నేతలకు సైతం సమాచారం అందిస్తారట. కీలక శాఖలన్నింటినీ బీజేపీ తన వద్దనే పెట్టుకుంటుందట. రైల్వే, విద్య, జలశక్తి, విద్యుత్, వ్యవసాయం, గనులు వంటి శాఖలను కానీ సహాయ మంత్రి పదవులను కానీ మిత్రపక్షాలకు కేటాయిస్తుందట. ఈ సారి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి డౌటేనని అంటున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణలలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పై ముగ్గురిలో కేంద్రంలో స్థానం దక్కని వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట. ఇక కిషన్ రెడ్డికి మాత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.





























