మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. రాజకీయ ప్రముఖులు కానీ, సినీ రంగ ప్రముఖులు కానీ చిరంజీవిపై, అలాగే పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న సమయంలో వెంటనే వారి నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి విమర్శలకు మెగా ఫ్యాన్స్ మరియు జన సైనికుల నుండి మంచి స్పందనే వస్తుంది.

సోషల్ మీడియాలో నాగబాబుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే నాగబాబు అప్పుడప్పుడు మతం గురించో, దేవుడు గురించో చేసే ట్వీట్లు మాత్రం నెటిజనులనే కాకుండా అటు జన సైనికులను, ఇటుమెగా ఫ్యాన్స్ ను కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయనడానికి ఉదాహరణగా తాజాగా ‘దేవుడు’ అన్న కాన్సెప్ట్ గురించి నాగబాబు చేసిన ట్వీట్ వైరలైంది. ఈ ట్వీట్ ఇంతిలా వైరల్ కావడానికి కారణమేమిటంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ని తన ట్వీట్ లో టార్గెట్ చేశాడు. తాజాగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తీసుకొని తనకు తెలిసిన విశ్లేషణను ఇచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో హిందూ దేవుళ్ళపై విమర్శలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగబాబు ఇప్పుడసలు దేవుడే లేడంటూ కొత్తగా ట్వీట్ చేయడం అందర్నీ షాక్ కి గురి చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్ ఆధారంగా నాగబాబు షేర్ చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే..

మన కంటికి కనిపించేది ఏదైనా.. ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే. లేకపోతే ఆ వస్తువుకి ఉనికి వుండదు. అలాగే ఇంతటి సువిశాల ప్రపంచం కూడా ఉనికిలో ఉందంటే దాన్ని కూడా ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉండాలి. ఆయనే భగవంతుడు అని రజనీ కాంత్ చెప్పారు. ఆ ట్వీట్స్ ఆధారంగా నాగబాబు స్పందిస్తూ `మరి ఈ విశాల ప్రపంచాన్ని క్రియేట్ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు.? ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీజన్ ఉండి తీరాలి. ఆ కారణమే దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్‌కు ఇంకో రీజన్ ఉండి తీరాలి. So.. వెతుక్కుంటూ పోతే.. దానికి ఆది, అంతమే ఉండదు. So.. దేవుడు అనే కాన్సెప్ట్ కి అసలు అర్ధమే లేదు. కాబట్టి మనందరం దేవుడు లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటే సరిపోతుంది. God is dead long back. So no worries. No guilt. BUT LIVE ACCORDING TO LAW. ” అంటూ తనదైన శైలిలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కామెంట్స్ ను కొట్టి పారేశారు.

ఇంతవరకూ బాగానే వుంది. కానీ,. అసలు నాగబాబు ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాక అటు మెగా ఫ్యాన్స్, ఇటు జన సైనికులు బుర్ర గోక్కుంటున్నారు. పైగా మతం, దేవుడు ఈ 2 అంశాలు చాలా సున్నితమైనవి. వీటిపై ఇష్టానుసారంగా ఎడాపెడా అభిప్రాయాలను షేర్ చేయడం వలన భవిష్యత్తులో నష్టమే తప్ప లాభమేమీ ఉండదని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.



























