దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచనున్నట్టు కీలక ప్రకటన చేసింది. 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎస్బీఐ సవరించింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రాగా 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వాళ్లకు ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది.

కరోనా, లాక్ డౌన్ వల్ల గతేడాది ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు భారీగా తగ్గాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్ల మేర ఎస్బీఐ వడ్డీరేట్లను పెంచడం గమనార్హం. సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు కాలపరిమితి డిపాజిట్లపై ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రభావం పడనుంది. రెన్యువల్ చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సైతం కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ లో వడ్డీరేట్లను సవరించిన ఎస్బీఐ మరోసారి వడ్డీరేట్లను సవరించడం గమనార్హం.

ప్రస్తుతం ఎస్బీఐ 5 నుంచి 10 సంవత్సరాలలోపు కాలపరిమితిపై 5.4 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లు అయితే 50 బేసిక్ పాయింట్లు అదనంగా వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు డిపాజిట్లపై 5.3 శాతం వడ్డీ, రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.1 శాతం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 5 శాతం వడ్డీ లభిస్తోంది.

7 నుంచి 45 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 2.9 శాతం వడ్డీ ఉండగా 46 రోజుల నుంచి 179 రోజుల డిపాజిట్లపై 3.9 శాతం వడ్డీ, 180 రోజుల నుంచి సంవత్సరం లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.4 శాతం వడ్డీరేటును పొందే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here