కాలం, ఖర్మం కలిసొస్తే మళ్లీ వస్తానంటూ రాజకీయాల నుంచి తప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలను వీడారు. ఇటీవలే టైం సెట్ అయిందనుకున్నారో ఏమో కానీ రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అంతా బాగుంటే ఆయన రేంజ్ మరోలా ఉండేది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. సునామీ మాదిరిగా ఈ కూటమి విజయపరంపరను కొనసాగించింది. ఇంతటి సునామీలో సైతం గెలవలేకపోయిన వారిని దురదృష్టవంతులనే చెప్పాలి. అలాంటి దురదృష్టవంతుల్లో ఒకరు కిరణ్ కుమార్ రెడ్డి. పదేళ్ల పాటు జనాలకు దూరంగా ఉండటం వల్లనో ఏమో కానీ ఆయనను జనాలు కూడా దూరం పెట్టేశారు. ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్లి అవకాశం ఉండేదేమో.

సామాజికవర్గపరంగానూ కలిసొచ్చిన ప్రాంతమే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఏపీ వైపు చూసింది కూడా పెద్దగా లేదు. చూసినా కూడా తన పనులు తాను చేసుకోవడం సైడ్ అయిపోవడం. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్నప్పుడు తొలుత కాంగ్రెస్‌లోనే చేరారు. కానీ యాక్టివ్‌గా పని చేయలేదు. ఆ తరువాత బీజేపీ లో చేరారు. లోక్‌సభకు పోటీ చేశారు. నిజానికి రాజంపేట ఆయన అడ్డానే. అక్కడి నుంచి వైసీపీ తరుఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పోటీ చేశారు. సామాజికవర్గం పరంగానూ.. టీడీపీ, జనసేనకు మంచి పట్టున్న ప్రాంతం కావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి అన్నీ కలిసి రావాలి. అయినా సరే కూటమి హోరు కానీ.. తన సామాజిక వర్గం కానీ ఆయనను నిలబెట్టలేక పోయాయి. ఫలితంగా కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

ఓటేసినా ఉండరన్న భావన?
ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో 20 స్థానాలను గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం కేవలం 4 స్థానాలకు పరిమితమైంది. వీటిలో టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. కూటమి కోల్పోయిన నాలుగు స్థానాల్లో రాజంపేట ఒకటి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కటమికి అత్యధిక శాసనసభా స్థానాలను గెలుచుకుంది. కానీ లోక్‌సభ స్థానం మాత్రం పోయింది. నల్లారికి ఓట్లు బదిలీ కాలేదు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం పీలేరు నుంచి టీడీపీ తరుఫున శాసనసభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించాడు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తన ఓటమికి కారణం లేకపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్లుగా ఏపీలో లేకపోవడం.. హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆయనకు ఓటేసినా కూడా ఏపీలో ఉండరన్న భావన జనాల్లో ఉండి ఉండొచ్చు. ఇక పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గత కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. మొత్తమ్మీద కిరణ్ కుమార్ రెడ్డి అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా? లేదంటే గుడ్ బై చెబుతారా? అనేది తెలియాల్సి ఉంది.





























