Murder Attempt : రాయలసీమలో పాత కక్షలు మళ్ళీ భగ్గుమన్నాయి. అనంతపురం జిల్లా లోని బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వెంకట రమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డి లను టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు.

అయితే ఆ గ్రామ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి హత్యకు ప్రతీకారంగా అతని కుమారుడు నాగలింగేశ్వర్ రెడ్డి, అనుచరుడు పవన్‌కుమార్‌రెడ్డి ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గతంలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, వెంకటరమణారెడ్డి మధ్య రస్తా విషయంలో గొడవ జరిగింది. దీంతో సోమిరెడ్డిపై వెంకట రమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్ రెడ్డి మొద్దుతో దాడి చేశారు. ఆ దాడిలో సోమిరెడ్డి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దీంతో వెంకటరమణారెడ్డి, అతని కుమారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య కక్షలు కొనసాగుతున్నాయి. సోమిరెడ్డి హత్య కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు వెంకటరమణారెడ్డి , పెద్ద కుమారుడు పుల్లారెడ్డి, రెండో కుమారుడు గరుడ శేఖర్ రెడ్డి పల్సర్ బైక్ పై సోమవారం ఉదయం 9.30 గంటలకు రేగడికొత్తూరు నుంచి అనంతపురం కోర్టుకు బయలుదేరారు.
అదును చూసుకొని ప్రత్యర్థులపై దాడి…
విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు పామురాయి – సోములదొడ్డి మధ్య పెద్దమ్మ ఆలయ సమీపంలో బైక్‌ను వెనుక నుంచి టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ గాల్లోకి ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డి అపస్మారకస్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు బెంగళూరుకు రెఫర్ చేశారు. అయితే సఫారీ తో గుద్దిన వాహనాన్ని నాగలింగేశ్వర్ రెడ్డి ఇటీవల ఉరవకొండకు చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పై తగిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.