‘భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకు అండా.. దండా” సంగీత దర్శకుడు బప్పిలహరి అందించిన పాటలు ఆనాటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… దర్శకుడు విజయబాపినీడు చిరంజీవితో పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, మగధీరుడు, హీరో, ఖైదీ నెంబర్ 786, బిగ్ బాస్ చిత్రాలను రూపొందించారు. గ్యాంగ్ లీడర్ చిత్రం మిగతా సినిమాలతో పోలిస్తే సూపర్ డూపర్ హిట్ అయింది. దర్శకుడు విజయ బాపినీడు తీసిన 22 చిత్రాల్లో చిరంజీవితోనే ఎక్కువ చిత్రాలు నిర్మించారు.

1991 శ్యాం ప్రసాద్ ఆర్ట్స్, విజయబాపినీడు రచన, దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. మురళి మోహన్, శరత్ కుమార్, సుమలత, సత్యనారాయణ, రావు గోపాల్ రావు ప్రధాన పాత్రల్లో కనిపించారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సూపర్ హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సినిమా పడింది. ప్రభుదేవా మాస్టర్ సమకూర్చిన నృత్యాలు సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. చిరంజీవి మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కుటుంబ కథతో కూడిన ఈ సినిమాను మాస్ ప్రేక్షకులకు కూడా నచ్చేలా తీసిన ఘనత విజయబాపినీడుకే దక్కుతుంది.

ఈ చిత్రానికి చిరంజీవిని తప్ప మరొక హీరోను ఊహించుకోలేము.చిరంజీవితో నిర్మించిన ఈ సినిమా విజయదుందుభి మోగించింది… అయితే ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విషయం ఏమిటంటే… 1986 చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి తమ్ముడు నాగబాబు… ఆ తర్వాత మరణమృదంగం, కొండవీటి దొంగ లంకేశ్వరుడు లాంటి చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించారు. పరిష్కారం, నాయకురాలు, దాదర్ ఎక్స్ప్రెస్, అగ్రిమెంట్, 420 లాంటి చిత్రాల్లో నాగబాబు హీరోగా నటించారు.
Gang Leader : ‘అరె ఓ సాంబ’ అనే టైటిల్ ని ఖరారు చేసి నాగబాబు కథ వినిపించారు

చిరంజీవితో అనేక చిత్రాలను నిర్మించిన విజయబాపినీడు చిరంజీవి తమ్ముడు నాగబాబుతో కూడా ఓ సినిమా తీయాలనుకున్నారు. ఆ క్రమంలో విజయబాపినీడు హీరో ఎలివేషన్స్ తో కూడిన ఫ్యామిలీ స్టొరీని సిద్ధం చేసి ‘అరె ఓ సాంబ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. నాగబాబుకి ఆ కథని వినిపించగా… ఈ కథ తన కంటే అన్నయ్య చిరంజీవికి బాగుంటుందని విజయబాపినీడుకి సలహా ఇచ్చారు. అయితే చిరంజీవి బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథలో కొంత మార్పు చేసి చిరంజీవితో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని రూపొందించి బ్లాక్ బస్టర్ ని అందించారు.
































