కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ గురించి మనందరికీ తెలుసు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. దేశంలోని అర్హులైన రైతులంతా ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్ కోసం రిజిష్టర్ చేసుకోవడంతో పాటు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. సంవత్సరానికి 6 వేల రూపాయలు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులకు జమ చేస్తోంది.

గత నెలలో కేంద్రం ఏడో విడత నగదును అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేసింది. రైతులకు ఆర్థిక సాయం అందించాలనే సదుద్దేశంతో కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ పై రైతుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే మోదీ సర్కార్ కొంతమంది రైతుల ఖాతాల నుంచి ఇప్పటికే జమ చేసిన పీఎం కిసాన్ స్కీమ్ నగదును వెనక్కు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. కేంద్రం దేశంలోని కొంతమంది రైతులకు అర్హత లేకపోయినా ఈ స్కీమ్ నగదును జమ చేసింది.

దాదాపు 1,364 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఈ స్కీమ్ ద్వారా జమైనట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న 20 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ మొత్తం జమైనట్లు వెలుగులోకి వచ్చింది. పంజాబ్ లో ఎక్కువగా అర్హత లేని రైతుల ఖాతాలలో ఈ నగదు జమైంది. అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కొంతమంది రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందినట్టు నివేదికల్లో వెల్లడైంది.

అనర్హుల ఖాతాల్లో జమైన నగదును అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్లు వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నాయి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లించినా, 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ పొందినా ఈ స్కీమ్ కు రైతులు అర్హత పొందరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here