‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో అప్పటికే పేరు పొందిన పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి నటులతో కలసి రాజబాబు నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో అప్పటి వరకు హాస్య నటులంటే పద్మనాభం, అల్లు రామలింగయ్య అని చెప్పుకున్న వారంతా అప్పటి నుంచి రాజబాబు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాంతో అప్పటి అగ్రతారలందరి సినిమాలలో పలు కీలక పాత్రలు పోషించే అవకాశాలను అందుకున్నారు. రాజబాబు, రమాప్రభ జంట ఎన్నో చిత్రాలలో నటించి హిట్ పెయిర్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా ‘తాత-మనవడు’లో తాతగా ఎస్వీ రంగారావు, మనవడుగా రాజబాబు నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. దర్శకుడిగా దాసరికి, నటులుగా ఎస్వీ రంగారావు, రాజబాబులకు గొప్ప పేరొచ్చింది. తరువాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా నటించారు. “తిరపతి, ఎవరికి వారే యమునా తీరే” వంటి చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఈ క్రమంలోనే ‘పిచ్చోడి పెళ్ళి, మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు.

మంచి క్రేజీ స్టార్‌గా మారడంతో మంచి రెమ్యునరేషన్ అందుకున్నారు. దాంతో సొంతగా ‘బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో రాజబాబు రూపొందిన చిత్రాలలో ‘ఎవరికి వారే యమునా తీరే’ సూపర్ హిట్ సాధించగా, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ‘రాధమ్మ పెళ్ళి’ సినిమాలో రాజబాబు, రమాప్రభ సొంత గొంతుతో ‘కాకినాడ రేవు కాడా ఓడెక్కి…’ అనే పాట పాడటం విశేషం. ఈ పాట గురించి అప్పట్లో ప్రేక్షకులు తెగ చెప్పుకునేవారు.

ఆ తర్వాత కూడా రాజబాబు కొన్ని పాటల్లో స్వయంగా తన గొంతు వినిపించారు. అప్పట్లో హాస్యనటులకు నంది అవార్డులు అనేవి లేవు. ఉంటే గనక ఎన్ని అవార్డులను దక్కించుకునేవారో చెప్పలేము. అయితే, రాజబాబు హాస్యాభినయాన్ని గౌరవిస్తూ కొన్ని సాంస్కృతిక సంస్థలు పలు అవార్డులు ప్రకటించారు. మద్రాస్ ఆంధ్రా క్లబ్ రోలింగ్ షీల్డ్ ను వరుసగా 5 ఏళ్ళు అందుకున్న ఘనత ఒక్క రాజబాబుదే కావడం గొప్ప విశేషం. ఇక రాజబాబు, మహాకవి శ్రీశ్రీ తోడల్లుళ్ళు కావడం మరో విశేషం. శ్రీశ్రీ భార్య సరోజకు రాజబాబు అర్ధాంగి లక్ష్మీ అమ్ములు సోదరి అవుతుంది.

అలాగే, గాయని రమోల కూడా రాజబాబు భార్యకు సోదరి అవుతారు. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేశ్ బాబు. వీరిద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు తమ్ముళ్ళలో చిట్టిబాబు, అనంత్ ఇద్దరూ హాస్యనటులుగా ప్రేక్షకులకు సుపరిచితులు. ఇక రాజబాబు మీద కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. ఆయన సినిమాలను నిర్మించడం వల్ల చాలా నష్టపోయారని, తన కుటుంబానికి ఏమీ సంపాదించలేదని కొన్ని సార్లు ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. ఆయన తన పిల్లలకోసం స్థిరాస్థులను బాగానే సంపాదించి పెట్టారు. వారి జీవితాలను చక్కదిద్దారు. ఏ లోటు లేదని చాలా తక్కువమందికి తెలుసు.



































