గత కొన్ని రోజులుగా ముంబై హైకోర్టు మహిళా జడ్జి పుష్ప ఇస్తున్న తీర్పులు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరి నుంచి ఆమె తీర్పులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి వివాదాస్పద తీర్పులు ఇస్తున్న జడ్జికి శాశ్వత హోదా కల్పించే విధంగా సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సును సుప్రీం కోర్టు వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పుష్ప ముంబై హైకోర్టులోని నాగ్ పూర్ బెంచ్ కు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 20వ తేదీన పుష్పకు శాశ్వత హోదా కల్పించడానికి సిఫార్సులు చేయగా ఆ సిఫార్సులను వెనక్కున్నారు. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జస్టిస్ పుష్ప ఇచ్చిన వివాదాస్పద తీర్పులను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటార్నీ జనరల్ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరమని చెప్పగా సుప్రీంకోర్టు జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

ఈ నెల 19వ తేదీన జస్టిస్ పుష్ప ఒక వ్యక్తి బాలిక ఛాతీ భాగాన్ని తడమగా చర్మం తగలలేదు కాబట్టి లైంగిక వేధింపుల కేసుగా పరిగణించలేమని.. శరీర భాగాలను దుస్తులపై నుంచి తాకడం నేరం కాదని ఆమె పేర్కొన్నారు. అయిదేళ్ల బాలిక కేసుకు సంబంధించి కూడా జస్టిస్ పుష్ప వివాదాస్పద తీర్పు ఇచ్చారు. మైనర్ బాలిక చేతులను పట్టుకోవడం లైంగిక వేధింపుల కిందికి రాదని జస్టిస్ పుష్ప పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థపైనే అపనమ్మకం కలిగించే విధంగా జస్టిస్ పుష్ప తీర్పులు ఉండగా ఆమెకు శాశ్వత హోదా కల్పించకుండా అడుగులు పడటం గమనార్హం. గతంలో కూడా జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులను పునఃపరిశీలించాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here