75 ఏళ్ల వయస్సులో కూడా ఎన్నో పతకాలు.. ఇంతకు అతడి రహస్యం ఏంటి..?

0
343

‘ముసలోడే కానీ మహానుభావుడు’ అనే డైలాగ్ ను సినిమాలో బ్రహ్మానందం చెబుతారు. నిజ జీవితంలో ఆ డైలాగ్ కు అచ్చం అచ్చగుద్దినట్లు సరిపోతాడు ఈ 75 ఏళ్ల వృద్ధుడు. ఇంతకు అతడి గొప్పతనం ఏంటంటే.. 20 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్లే ఒక కిలోమీటరు దూరం పరుగెత్తడానికి నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది అతడు 75 ఏళ్ల వయస్సులో కూడా ఎన్ని కిలో మీటర్లు అయినా అవలీలగా పరుగెత్తి నేటి తరానికి తాను ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు ఈ విశాఖకి చెందిన ఈ పెద్దాయన.

ప్రహ్లాదపురం దరి విరాట్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తాళాబత్తుల వెంకటరమణ(75) పరుగులో తన మార్క్ ను చూపిస్తున్నారు. అతడు పరుగులో చూపించిన ప్రతిభకు యవకులు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
అతడు ఐదేళ్ల వయస్సులోనే పరుగు పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు. ఉదయం వ్యాయామం, నడక, ధ్యానం చేస్తుంటాడు. దీంతో రోజంతా ఉల్లాసంగా ఉండటమే కాకుండా.. ఏ పని చేయాలన్నా అలసట రాదని అతడు చెబుతున్నాడు.

అతడు పరుగుల వీరుడే కాదు.. నాటకాల్లో కూడా నటించే ధీరుడు కూడా. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే పలు నాటకాల్లో అతడు ప్రదర్శించి మెప్పించాడు. ప్రస్తుతం కరోనా కారణంగా అవి జరగడం లేదని.. మళ్లీ మొదలైతే అందులో కూడా పాల్గొంటానని చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అథ్లెటిక్స్‌లో పాల్గొని ఎన్నో పతకాలను కైవసం చేసుకున్నాడు.

75 ఏళ్ల వయస్సు వచ్చినా అతడిలో ఉత్సాహం తగ్గలేదు. అంతేకాకుండా అతడిని చూసి చాలా మంది స్పూర్తిగా తీసుకుంటున్నారు. ఎన్ని పనులు ఉన్నా వ్యాయామం చేయడం అనేది మనిషికి ఎంతో అవసరం అని అతడు చెబుతున్నారు. రోగాలు దరిచేరకుండా ఉండటమే కాదు.. చేసే పనిలో కూడా ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నాడు. మంచి అలవాట్లతో జీవిస్తే నిత్యం ఉల్లాసంగా ఉండవచ్చని చెప్పారు. అతడు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటానన్నాడు.