దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఈ ఐదు తప్పులు పొరపాటున కూడా చేయవద్దంటూ హెచ్చరించింది. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతుండటం, ఖాతాదారులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్ల వల్ల అకౌంట్లలోని నగదు ఖాళీ అవుతూ ఉండటంతో ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్ చేసింది. ఖాతాదారులు జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచుకుని అలాంటి మోసాల బారిన పడకుండా రక్షించుకోవాలని పేర్కొంది.
దసరా, దీపావళి పండగల నేపథ్యంలో కస్టమర్లను ఎస్బీఐ అలర్ట్ చేసింది. ఐదు తప్పులు చేయవద్దని ఎస్బీఐ కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. బ్యాంక్ అధికారులు కస్టమర్లకు ఫోన్ చేసి ఖాతాలకు సంబంధించిన వివరాలను అడగరని.. అలాంటి కాల్స్ వస్తే జాగ్రత్త వహించాలని సూచించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, యూపీఐ పిన్ వివరాలు, సీవీవీ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోవద్దని ఎస్బీఐ వెల్లడించింది.
ఎవరైనా కాల్ చేసి ఓటీపీ లేదా సీవీవీ నంబర్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని కార్డ్ బ్లాక్ అవుతుందంటూ కొంతమంది హెచ్చరిస్తూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. చాలామంది బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని మొబైల్ ఫోన్లలో పొందుపరుస్తారని అలా చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని పేర్కొంది.
అపరిచిత వ్యక్తులకు ఏటీఎం కార్డులకు సంబంధించిన ఏ వివరాలను చెప్పవద్దని.. ఇతరులకు ఏటీఎం కార్డు వివరాలను చెబితే ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇతరుల ఫోన్లు, ల్యాప్ టాప్ లలో బ్యాంక్ లావాదేవీలను నిర్వహించవద్దని అలా చేస్తే ఇతరులకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశాలు ఉంటాయని పేర్కొంది.