చైనా దేశంలోని వుహాన్ నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి అనేక విధానాలను అవలంబిస్తున్నాయి. అయితే చైనాలా పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో మాత్రం విఫలవుతున్నాయి. భారత్ లో ప్రతిరోజూ 80,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతుండగా 1000లోపు మరణాలు నమోదవుతున్నాయి.

వైరస్ ఉధృతి భారత్ తో పాటు పలు దేశాల్లో కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రపంచంలోని జనాభాలో ప్రతి పది మందిలో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డారని తేలింది. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర నిపుణుడు మైకేల్ ర్యాన్‌ కరోనా వైరస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న డబ్ల్యూహెచ్ఓ లోని ఎగ్జిక్యూటివ్ సభ్యులతో జరిగిన సమావేశంలో మైఖేల్ ర్యాన్ పాల్గొని ప్రపంచ దేశాల్లో కరోనా పరిస్థితుల గురించి వివరించారు.

డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా కరోనా బారిన పడి ఉండవచ్చని భావిస్తున్నామని పేర్కొన్నారు. భారత్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు. మైఖేల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ దేశాన్ని, ప్రాంతాన్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం మారుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయలేకపోతున్నామని అన్నారు.

ఆగ్నేయ ఆసియా, యూరప్ లో ప్రధానంగా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోందని.. మెజారిటీ జనాభాకు కరోనా ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. మొదట కరోనా మహమ్మారి ఏ విధంగా వ్యాప్తి చెందిందనే విషయాలకు సంబంధించి చైనాకు నిపుణులను పంపిస్తున్నామని తెలిపారు. మరోవైపు సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here