ప్రజలకు అలర్ట్.. కరోనా కట్టడికి కేంద్రం కొత్త నిబంధనలు..?

0
315

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వైరస్ కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ కరోనాను కట్టడి చేయడానికి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిసెంబర్ నెలలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాల్సిన కరోనా నిబంధనలను వెల్లడించింది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ విజృంభిస్తోంది.

పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్రం కంటైన్మెంట్ జోన్ల వెలుపల లాక్ డౌన్ ను అమలు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. కేంద్రం కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతులను ఇచ్చింది. జిల్లా యంత్రాంగం,పోలీసులు కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చేయాలని పేర్కొంది.

రాష్ట్రాలు కరోనా కేసులు పెరిగితే రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లను సూక్ష్మ స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల వెబ్ సైట్లలో కంటైన్మెంట్ జోన్లకు సంబంధించిన వివరాలను పొందుపరచాలని.. ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచనలు చేసింది. ఎగ్జిబిషన్ హాళ్లు, ఈత కొలనులు, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.

50 శాతం కెపాసిటీతో థియేటర్లకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఉన్నవాటిపై ఆంక్షలు విధించవచ్చు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని.. ప్రజలు మాస్క్ ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, భౌతికదూరం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది.