కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. కరోనా ఉధృతి తగ్గిందనుకునే లోపు కొత్తరకం కరోనాకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే 12 సంవత్సరాల క్రితమే ఒక వైరాలజిస్ట్ కరోనా గురించి హెచ్చరించారు.
ప్రపంచ దేశాలు ఆయన హెచ్చరికలను పట్టించుకొని ఉంటే మాత్రం ప్రస్తుతం పరిస్థితి మరో విధంగా ఉండేదని ఇతర శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు చెందిన నాథన్ వోల్ఫ్ అనే వైరాలజిస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అంటువ్యాధులను నియంత్రించడంలో ఫెయిల్ అవుతున్నాయని ఇలా జరగడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
అడవులను నిర్మూలించే క్రమంలో జంతువుల ద్వార కొత్తరకం వైరస్ లు మనుషులకు సోకే అవకాశం ఉందని ఆయన అన్నారు. కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకి మనిషి మరణించి ఉండవచ్చని అయితే ఆ వైరస్ ఇతరులకు వ్యాపించకపోడం వల్ల కొన్నిసార్లు వైరస్ వ్యాప్తి చెందకపోవచ్చని అన్నారు. అంటువ్యాధుల గురించి అప్పట్లో నాథన్ వోల్ఫో చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ దేశాలు అంటువ్యాధుల గురించి ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రజలు అంటువ్యాధులు ప్రబలిన సమయంలో వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎన్ని కొత్త వైరస్ లు పుట్టుకొచ్చినా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు తగ్గడంతో పాటు ప్రజలు ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.